Congress: నా మొబైల్ ఫోన్‌ను ట్యాప్ చేశారు: రాహుల్ గాంధీ ఆగ్రహం
- పెగాసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి
- ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా స్పైవేర్ సాఫ్ట్ వేర్ వాడారు
- సీబీఐ డైరెక్టర్ ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేశారు
- పెగాసస్ వినియోగించి రాజద్రోహానికి పాల్పడ్డారు
ఇజ్రాయెల్ కు చెందిన స్పైవేర్ ‘పెగాసస్’ సాయంతో భారత్ లోని పలువురు నేతలు, జర్నలిస్టుల ఫోన్లపై నిఘా ఉంచినట్లు వస్తోన్న కథనాలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పెగాసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన మొబైల్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు.
'నేను ప్రతిపక్ష నాయకుడిని.. ప్రజల గళాన్ని నేను వినిపిస్తాను. నా ఫోన్ ట్యాపింగ్ చర్య ప్రజల గళానికి వ్యతిరేకంగా జరిగిన దాడి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాల్సిందే. పెగాసస్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగాలి' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు తాను భయపడబోనని రాహుల్ గాంధీ చెప్పారు. మోసాలకు పాల్పడే వారికే భయం ఉంటుందని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా స్పైవేర్ సాఫ్ట్ వేర్ వాడారని రాహుల్ గాంధీ అన్నారు. సీబీఐ డైరెక్టర్ ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. పెగాసస్ ఓ ఆయుధం వంటిదని, ఇది ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వాడడం కోసం ఉద్దేశించినదని ఇజ్రాయెల్ ఇప్పటికే పేర్కొందని అన్నారు. ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి కలసి దేశానికి వ్యతిరేకంగా, వ్యవస్థలకు వ్యతిరేకంగా పెగాసస్ ను వాడారని ఆయన ఆరోపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చర్యలకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ విమర్శించారు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగానూ పెగాసస్ వాడారని, దేశంలోని అన్ని సంస్థలకూ వ్యతిరేకంగా దాన్ని వాడారని ఆరోపించారు. పెగాసస్ వినియోగించి రాజద్రోహానికి పాల్పడ్డారంటూ ఆయన మండిపడ్డారు.