Rajya Sabha: రాజ్య‌స‌భ‌లో కేంద్ర మంత్రి చేతుల్లోంచి కాగితాలు లాక్కుని విసిరేసిన టీఎంసీ ఎంపీ.. స‌స్పెన్ష‌న్ వేటు!

rajya Sabha Deputy Chairman Harivansh requests TMC MP Santanu Sen to withdraw from the House as he has been suspended from the House

  • స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌ని వెంక‌య్య నాయుడు సూచ‌న
  • వెళ్ల‌కుండా సీట్లోనే కూర్చున్న శంత‌ను
  • స‌స్పెన్ష‌న్‌పై టీఎంసీ నేత‌ల అభ్యంత‌రాలు

టీఎంసీ ఎంపీ శంత‌ను సేన్‌పై రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ వెంక‌య్య నాయుడు ఈ రోజు స‌స్పెన్షన్ వేటు వేశారు. పెగాస‌స్ వ్య‌వ‌హారంపై రాజ్య‌స‌భ ద‌ద్ద‌రిల్లుతోన్న విష‌యం తెలిసిందే. నిన్న‌ రాజ్యసభలో ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్‌ పెగాసస్‌ స్పైవేర్‌పై ప్రకటనను చదివి వినిపిస్తుండ‌గా సభ్యులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ స‌మ‌యంలో టీఎంసీ సభ్యుడు శంతను సేన్‌.. వైష్ణ‌వ్ చేతిలో నుంచి ప‌లు పత్రాలను లాక్కొని చింపి వాటిని రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ వైపుగా విసిరేశారు.

దీంతో ఈ రోజు ఆయ‌న తీరుపై రాజ్య‌స‌భ‌లో కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి వి.మురళీధరన్ సస్పెన్షన్ కోసం తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. దీంతో వెంకయ్య నాయుడు ఈ తీర్మానాన్ని మూజువాణి ఓటు ద్వారా ఆమోదిస్తూ శంత‌ను సేన్‌పై సస్పెన్ష‌న్ వేటు వేశారు.

వ‌ర్షాకాల స‌మావేశాలు పూర్తయ్యే వ‌ర‌కు సేన్‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని శంత‌ను సేన్‌కు ఆయ‌న సూచించారు. దీంతో టీఎంసీ స‌భ్యులు అభ్యంత‌రాలు తెలుపుతూ ఆందోళ‌న‌కు దిగారు. దీంతో కొద్ది సేపు స‌భ వాయిదా ప‌డింది.

స‌భ మ‌ళ్లీ ప్రారంభం అయ్యాక కూడా ఎంపీ శంత‌ను సేన్ బయటకు వెళ్లకుండా సీట్లోనే ఉండిపోయారు. దీంతో స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని డిప్యూటీ చైర్మ‌న్ హ‌రివంశ్ కోరారు. అనంత‌రం మ‌ళ్లీ రాజ్య‌స‌భ వాయిదా ప‌డింది. మరోపక్క, టీఎంసీ ఎంపీ శంత‌ను సేన్‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌డంతో టీఎంసీ నేత‌లు అంద‌రూ మండిప‌డుతున్నారు. పెగాస‌స్ వ్య‌వ‌హారంపై పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోనూ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు నిర‌స‌న తెలుపుతున్నారు.

  • Loading...

More Telugu News