Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ లో తొలి స్వర్ణం చైనాదే!
- 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో చైనాకు స్వర్ణం
- రష్యన్ షూటర్ పై విజయం సాధించిన యాంగ్ కియాన్
- కాంస్య పతకం సాధించిన స్విట్జర్లాండ్
టోక్యో ఒలింపిక్స్ లో పతకాల వేట ప్రారంభమైంది. ఆటగాళ్లు పతకాలను మెడలో వేసుకుని భావోద్వేగాలకు గురవుతున్నారు. మెడల్స్ అందుకునే సమయంలో తన దేశ జాతీయగీతం వినిపిస్తుంటే ఉద్వేగంతో కంటతడి పెడుతున్నారు. తొలి స్వర్ణాన్ని డ్రాగన్ కంట్రీ చైనా ముద్దాడింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో చైనా షూటర్ యాంగ్ కియాన్ విజయం సాధించింది. రష్యన్ షూటర్ గలాషినా అనస్టాసియాను స్వల్ప తేడాతో ఆమె ఓడించింది.
వీరిద్దరి మధ్య పోరు నువ్వా? నేనా? అన్నట్టుగా సాగింది. ఇద్దరి మధ్య పోరు 125.6-126.0, 147.3-146.2, 168.3-167.6, 188.9-189.1, 210.0-210.5, 231.3-231.4తో సాగింది. స్విట్జర్లాండ్ కు చెందిన క్రిస్టినా నీనా 230.6 పాయింట్లతో కాంస్య పతకం సాధించింది.