Vellampalli Srinivasa Rao: తాళ్లాయపాలెం శైవక్షేత్రం వద్ద మంత్రి వెల్లంపల్లికి రాజధాని రైతుల సెగ!
- శివస్వామి ఆశీస్సుల కోసం వచ్చిన వెల్లంపల్లి
- వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించిన రైతులు
- పోలీసుల అనుమతి నిరాకరణ
- మంత్రికి వ్యతిరేకంగా రైతుల నినాదాలు
ఇవాళ గురుపౌర్ణమి సందర్భంగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గుంటూరు జిల్లాలోని తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రానికి విచ్చేశారు. శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామిని కలిసి ఆశీస్సులు అందుకోవాలని వచ్చారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి రైతులు మంత్రిని కలిసి వినతి పత్రం అందించేందుకు యత్నించారు. అమరావతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని కుదించారంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే, మంత్రిని కలిసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెల్లంపల్లి దేవాదాయ మంత్రి అయ్యాక ఆలయాలపై దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిస్టిర్ డౌన్ డౌన్... వెల్లంపల్లి రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, మంత్రి వెల్లంపల్లి పోలీసుల రక్షణ నడుమ కారెక్కి వెళ్లిపోయారు.