Asaduddin Owaisi: ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటే జట్టుకడతాం: ఎస్‌పీకి స్పష్టం చేసిన ఎంఐఎం

MIM Ready to mingle hands with SP but one condition
  • వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు
  • కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదన్న అసద్
  • ఎస్‌పీతో పొత్తుకు షరతు
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ పొత్తులు కలుపుకునే పనిలో పడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) తో పొత్తుకు సిద్ధమైన అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం ఓ కండిషన్ పెట్టింది. ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కనుక తమకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని షరతు విధించింది. వచ్చే నెలలో యూపీలో పర్యటించనున్న అసదుద్దీన్ ఎస్‌పీతో పొత్తు విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.

రానున్న ఎన్నికల్లో యూపీలో వంద స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని అసద్ ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల యూపీలో పర్యటించిన ఆయన.. కాంగ్రెస్‌ను మునిగిపోతున్న నావగా అభివర్ణించారు. ఆ పార్టీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రంలోని బీజేపీని సాగనంపేందుకు పొత్తు అవసరమన్న ఆయన ఎస్‌పీతో పొత్తు విషయాన్ని ఆలోచిస్తున్నట్టు చెప్పారు.

ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నా, గెలిస్తే మాత్రం తమకే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్‌ను ఎస్‌పీ ఎదుట ఉంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకు ఆ పార్టీ అంగీకరిస్తే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని అసద్ యోచిస్తున్నట్టు సమాచారం.
Asaduddin Owaisi
MIM
Uttar Pradesh
Samajwadi Party

More Telugu News