Chandrababu: టోక్యో నుంచి బుడాపెస్ట్ వరకు భరతమాత పుత్రికలు గర్వించేలా చేస్తున్నారు: చంద్రబాబు
- హంగేరిలో వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్ షిప్
- స్వర్ణం గెలిచిన భారత రెజ్లర్ ప్రియా మాలిక్
- నిన్న టోక్యో ఒలింపిక్స్ లో చాను రజతం
- ఉప్పొంగుతున్న భారతావని
- అభినందనలు తెలిపిన చంద్రబాబు
హంగేరి రాజధాని బుడాపెస్ట్ లో జరుగుతున్న వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ స్వర్ణం సాధించింది. 73 కిలోల విభాగంలో పోటీపడిన ప్రియా ఫైనల్లో బెలారస్ కు చెందిన క్సెనియా పటాపోవిచ్ పై 5-0తో గెలుపొందింది. నిన్న టోక్యో ఒలింపిక్స్ లో మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించడం, ఇవాళ ప్రపంచ చాంపియన్ షిప్ లో ప్రియా పసిడి సంబరం భారత క్రీడాభిమానులను ఉప్పొంగిపోయేలా చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. టోక్యో నుంచి బుడాపెస్ట్ వరకు ప్రపంచ వేదికపై భరతమాత పుత్రికలు మనందరినీ గర్వించేలా చేస్తున్నారని కొనియాడారు. హంగేరీలో జరుగుతున్న వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో ప్రియా మాలిక్ స్వర్ణం సాధించడం హర్షణీయమని పేర్కొన్నారు. కంగ్రాచ్యులేషన్స్ ప్రియా మాలిక్ అంటూ ట్వీట్ చేశారు.