Rajamahendravaram: తగ్గుముఖం పట్టిన గోదావరి వరద ఉద్ధృతి.. ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
- ధవళేశ్వరం వద్ద 11.50 అడుగుల నీటి మట్టం
- 9.56 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు
- జలదిగ్బంధంలో దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు
ఎగువన కురిసిన వర్షాలతో ఇటీవల ఉద్ధృతంగా మారిన గోదావరి నది కొంత శాంతించింది. నదికి వస్తున్న వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇటీవల జారీ చేసిన ఒకటో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు.
ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 11.50 అడుగుల నీటిమట్టం ఉంది. బ్యారేజీ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసిన అధికారులు 9.56 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విలీన మండలాల్లోని రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలతో రాకపోకలు నిలిచిపోయాయి.