Gone Prakash Rao: ఈటలను గెలిపించుకోవాల్సిన బాధ్యత హుజూరాబాద్ ప్రజలపై ఉంది: గోనె ప్రకాశ్ రావు
- ఇన్నేళ్లలో ఈటల ఎలాంటి అవినీతికి పాల్పడలేదు
- నా మద్దతు ఈటల రాజేందర్ కే
- ఈటలను ఎదుర్కోవడం కోసమే దళితబంధు పథకాన్ని కేసీఆర్ తీసుకొస్తున్నారు
హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఆర్టీసీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఇంటెలిజెన్స్ పోలీసులకు కూడా అంతుబట్టని విధంగా వస్తుందని అన్నారు. హుజూరాబాద్ నుంచి ఈటల ఇప్పటి వరకు ఆరు సార్లు గెలిచారని... ఇన్నేళ్లలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. ఇలాంటి మంచి నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందని అన్నారు. తన మద్దతు ఈటలకే అని చెప్పారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఎదుర్కోవడం కోసమే దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొస్తున్నారని గోనె ప్రకాశ్ రావు అన్నారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెపుతానని ఈటల చెప్పినప్పటికీ... ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని విమర్శించారు. నిర్మల్ లో ఓ మంత్రి చెరువులను కబ్జా చేయడంతో... ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలన్నీ నీటమునిగాయని దుయ్యబట్టారు. ఆ మంత్రిపై కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.