Raghu Rama Krishna Raju: జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా
- ఇప్పటికే జగన్, రఘురామ లిఖిత పూర్వకంగా వాదనలు
- లిఖిత పూర్వకంగా తామూ వాదనలు సమర్పిస్తామన్న సీబీఐ
- మరోసారి గడువు ఇవ్వాలని విజ్ఞప్తి
- విచారణ ఈ నెల 30కి వాయిదా
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై ఈ రోజు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఇప్పటికే వైఎస్ జగన్, రఘురామకృష్ణరాజు లిఖిత పూర్వకంగా తమ వాదనలు సమర్పించారు. అయితే, లిఖిత పూర్వకంగా తామూ వాదనలు సమర్పిస్తామని సీబీఐ చెప్పింది.
అందుకు మరోసారి గడువు ఇవ్వాలని కోర్టును కోరింది. దీంతో విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా, జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ నెల 14న కూడా విచారణ జరగగా, తాము లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించేందుకు 10 రోజుల గడువు ఇవ్వాలని సీబీఐ కోరిన విషయం తెలిసిందే.
సీబీఐ తీరుపై రఘురామ తరఫు న్యాయవాది ఆ సమయంలో అభ్యంతరాలు తెలిపారు. సీబీఐ తరచూ వైఖరి మారుస్తూ కాలయాపన చేస్తోందన్నారు. దీంతో కోర్టు ఆ సమయంలో ఈ నెల 26 (నేడు)కి విచారణను వాయిదా వేయడంతో నేడు విచారణ జరిగింది. అయితే, సీబీఐ మరింత సమయం కోరడంతో వాయిదా పడింది.