Ladakh: భారత సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు చర్యలు
- దెమ్‌చోక్‌లోని చార్డింగ్ నాలా వద్ద చైనా సైనికుల గుడారాలు
- వెళ్లిపోవాలని చెప్పిన భారత్
- వెళ్లకుండా అక్కడే ఉంటోన్న చైనా సైనికులు
భారత సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు చర్యలు కొనసాగుతున్నాయి. లడఖ్‌లోని దెమ్‌చోక్‌లోని చార్డింగ్ నాలా వద్ద చైనా సైనికులు గుడారాలు వేసుకుని ఉండడాన్ని భారత సైన్యం గుర్తించింది. చైనా పౌరులమని చెప్పుకుంటూ వారు అక్కడే ఉండడానికి ప్రయత్నించారు. దీంతో వారిని అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని భారత సైన్యం హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు.
అయినప్పటికీ వారు ఇప్పటికీ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌తో ఓపక్క చర్చలు జరుపుతూనే.. మరోపక్క చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. ఈ రోజు ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి కమాండర్ల సమావేశం జరగాల్సి ఉండగా కార్గిల్ యుద్ధ విజయ దినోత్సవ కార్యక్రమాలు ఉండటంతో భారత్ దీన్ని వాయిదా వేసింది.
కాగా, దెమ్చోక్, ట్రిగ్‌హైట్స్‌లను 1990ల్లో ఇండో చైనా జాయింట్ వర్కింగ్ గ్రూప్ వివాదాస్పద ప్రాంతాలుగా గుర్తించింది. అక్కడ చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుండంతో భారత సైన్యం అక్కడ పహారా కాస్తోంది. అయితే, ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగే వాతావరణం మాత్రం లేదని అధికారులు అంటున్నారు. ఆ ప్రాంతాల్లో రెండేళ్ల క్రితం ఉన్న నాటి పరిస్థితులు మళ్లీ నెలకొనాలని భారత్ కోరుతోంది.
అయితే, చైనా శాంతి వచనాలు పలుకుతూనే తన తీరును మార్చుకోకుండా రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తోంది. లడఖ్‌లో గత ఏడాది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అనంతరం పలు సార్లు ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు జరిగాయి. దీంతో భారత్, చైనా దళాలు వెనక్కి వెళ్లాయి. అనంతరం మళ్లీ చైనా తన వక్ర బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది.