Raghu Rama Krishna Raju: జగన్, విజయసాయిరెడ్డిలపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశా: రఘురామకృష్ణరాజు
- తనపై వారిద్దరూ లేఖలు రాశారన్న రఘురామ
- తాను కూడా వారి భాగోతాలు బట్టబయలు చేస్తున్నట్టు వెల్లడి
- అందుకే తాను కూడా లేఖ రాశానని వివరణ
- క్విడ్ ప్రో కో, సూట్ కేసు కంపెనీలు అంటూ విమర్శలు
సీఎం జగన్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తనపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశారని, ఇప్పుడు తాను కూడా వారిద్దరిపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. జగన్, విజయసాయిల అక్రమ ఆర్థిక వ్యవహారాలు, సూట్ కేసు కంపెనీలపై ఆ లేఖలో వివరించినట్టు తెలిపారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు.
"ఏ2 సహకారంతోనే ఈ అవకతవకలు జరిగాయి. ఏ2 స్థాపించిన కొన్ని సూట్ కేసు కంపెనీలతో ఏ1 ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖలో సవివరంగా తెలియజేశాను. సాయిరెడ్డీ... నాపైన నువ్వు అందరికీ లేఖలు రాశావు కదా! ట్విట్టర్ లో కూడా పెట్టావు కదా! ఇప్పుడు నీ క్విడ్ ప్రోకో భాగోతం నేను అందరికీ వివరిస్తా. నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్ గా ఉన్నప్పుడు నువ్వు ప్రారంభించిన సూట్ కేసు కంపెనీల భాగోతం కూడా ఆ లేఖలో రాశాను. నీపైన, నీ సహచర నిందితుడు జగన్ పైనా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరాను" అంటూ మీడియా సమావేశంలో వివరించారు.