Mirabai Chanu: టోక్యో ఒలింపిక్స్ లో మీరాబాయి చానుకు స్వర్ణం దక్కే అవకాశం... చైనా లిఫ్టర్ కు డోపింగ్ పరీక్షలు!
- టోక్యో ఒలింపిక్స్ లో చానుకు రజతం
- స్వర్ణం సాధించిన చైనా లిఫ్టర్
- డోపింగ్ కు పాల్పడ్డట్టు అనుమానం
- మరిన్ని పరీక్షలు జరపనున్న అధికారులు
టోక్యో ఒలింపిక్స్ లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ లో రజతం గెలవగా, చైనా లిఫ్టర్ ఝిహుయి హౌ స్వర్ణం దక్కించుకుంది. అయితే, మీరాబాయి చాను రజత పతకం స్వర్ణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా లిఫ్టర్ ఝిహుయి హౌకు టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు మరిన్ని డోప్ టెస్టులు నిర్వహించాలని భావిస్తుండడమే అందుకు కారణం. హౌ గనుక డోప్ టెస్టుల్లో విఫలమైతే మీరాబాయి చానును పసిడి విజేతగా ప్రకటిస్తారు.
49 కిలోల విభాగంలో మీరాబాయి 202 కేజీలు బరువెత్తగా, చైనా లిఫ్టర్ హౌ 210 కిలోలతో ప్రథమస్థానంలో నిలిచింది. హౌ నుంచి సేకరించిన నమూనాల పరిశీలనలో తొలి శాంపిల్ ఫలితం తేడాగా రావడంతో అధికారులు మరికొన్ని పరీక్షలు చేసి, ఓ నిర్ధారణకు రానున్నారు. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు చైనా లిఫ్టర్ ఏమైనా నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకుందా ?అనేది ఈ డోప్ టెస్టుల్లో తేల్చనున్నారు.