Guntur District: తొలి రాత్రి విచిత్ర ధోరణితో భార్యను షాక్‌కు గురిచేసిన భర్త.. న్యాయం చేయాలంటున్న కొత్త పెళ్లికూతురు!
- మన మధ్య శారీరక సంబంధం వద్దని, స్నేహితులుగా ఉందామన్న భర్త
- మానసిక సమస్యలతో బాధపడుతున్న వైనం
- మోసం చేసి పెళ్లి చేశారని ఆవేదన
- భర్త, అత్తతోపాటు మధ్యవర్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్
కోటి ఆశలతో తొలిరేయి భర్త గదిలోకి ప్రవేశించిన ఆమెకు అది కాళరాత్రి అయింది. భర్త విచిత్ర ప్రవర్తనతో విస్తుపోయింది. అంతేకాదు, అతడికి మానసిక సమస్యలతోపాటు మరెన్నో అనారోగ్య సమస్యలు ఉన్నట్టు తెలిసి విస్తుపోయింది. తన జీవితాన్ని నాశనం చేసిన అత్తింటి కుటుంబంపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తాడేపల్లిలో పనిచేస్తున్న ఓ మహిళ తన కుమారుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని నమ్మించి గుంటూరుకు చెందిన యువతితో సంబంధం కుదుర్చుకుంది. మే 26న వివాహం జరిగింది. ఈ సందర్భంగా యువతి తల్లిదండ్రులు రూ. 6 లక్షల కట్నం సమర్పించుకున్నారు.
తొలి రోజు భర్త గదిలోకి ప్రవేశించిన ఆమె.. అతడి ప్రవర్తనకు భయపడింది. వింతగా ప్రవర్తిస్తూ, విచిత్ర ధోరణితో ఆమెను విస్తుపోయేలా చేశాడు. ఈ వయసులో కోరికలు ఉండకూడదని ఆమెకు హితవు పలికి నిద్రపోయాడు. ఆ తర్వాతి రెండు రోజులు కూడా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె నిలదీస్తే.. భార్యాభర్తలు అంటే శారీరక సంబంధం కాదని, మంచి స్నేహితులుగా ఉందామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె నిర్ఘాంతపోయింది.
ఈ రోజు తాను వేసుకోవాల్సిన మాత్రలు అయిపోయాయని, అవి వేసుకోకుంటే తలనొప్పి, నోటివెంట సొంగ పడుతుందని, తన ఆరోగ్యం బాగాలేదని, మానసిక స్థితి కూడా సరిగా లేదని చెప్పడంతో యువతి షాక్‌కు గురైంది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అత్తింటివారిని నిలదీశారు.
దీంతో స్పందించిన వారు తమ కుమారుడు ఆరోగ్యవంతుడేనని, తలనొప్పికి మాత్రం ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాడని చెప్పారు. కావాలంటే అతడు చికిత్స తీసుకుంటున్న వైద్యులకు ఫోన్ చేయాలని కోరింది. బాధితురాలు వారితో మాట్లాడగా మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి మానసిక స్థితి సరిగా లేదని, మాత్రలు వాడకపోతే ప్రమాదమని చెప్పారు. ఈ విషయాలన్నీ దాచిపెట్టి పెళ్లి చేశారని, అడిగితే బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నరసరావుపేట పోలీసులకు ఫోన్ చేస్తే అత్తింటి వారికి ఉన్న పరిచయాలతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బాధిత యువతి ఆరోపించింది. మోసగించి సంసారానికి పనికిరాని వ్యక్తితో పెళ్లి చేసినందుకు అత్త, భర్తతోపాటు పెళ్లి కుదిర్చిన మధ్యవర్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.