Raghu Rama Krishna Raju: లక్ష్మీపార్వతిని అనుకరిస్తూ సెటైర్లు వేసిన రఘురామ.. వీడియో ఇదిగో!
- రఘురామ ప్రెస్ మీట్
- ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి అతిగా స్పందించారని వ్యాఖ్య
- ఆమె తెలుగును ప్రేమించాలని హితవు
- ఎన్టీఆర్ ను ప్రేమిస్తూనే ఉండాలని వ్యాఖ్యలు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నేత, తెలుగు-సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న ఓ ఇంటర్వ్యూకు చెందిన టీజర్ చూశానని, అందులో లక్ష్మీపార్వతి కాస్త అతిగా స్పందించారని విమర్శించారు. "జడ్జి గారిని కూడా ఏదో అన్నారంట గదయ్యా... దాన్ని సుమోటోగా తీసుకుంటారేమోనయ్యా" అంటూ ఆమెను అనుకరించారు.
తెలుగు అకాడమీ చైర్ పర్సన్ పదవిలో ఉంటూ "ఇంగ్లీషు మీడియం చాలా అవసరం గదయ్యా" అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని రఘురామ విమర్శించారు. రేపు ఇది తెలుగు-సంస్కృత-ఇంగ్లీషు అకాడెమీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు.
ఆమె హరికథలను చక్కగా తెలుగులో చెప్పేవారని, జీవితచరిత్రలను కూడా తెలుగులోనే రాసేవారని వ్యంగ్యం కురిపించారు. కానీ ఇప్పుడు ఇంగ్లీషు గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కానీ తెలుగును ఎంతో ప్రేమించి, తెలుగువారికి ఇంత గుర్తింపును తెచ్చిన ఎన్టీఆర్ గారు జీవిత చరమాంకంలో ఎంతో అభిమానించిన వ్యక్తి లక్ష్మీపార్వతి అని వివరించారు.
అలాంటి లక్ష్మీపార్వతి ఇప్పుడు ఇంగ్లీషు బాట పట్టడం సరికాదని, ఎన్టీఆర్ కు తలవంపులు తెచ్చే విధంగా వ్యవహరించరాదని అన్నారు. ఆమె మళ్లీ తెలుగును ప్రేమించాలని, ఎన్టీఆర్ ను ప్రేమిస్తూనే ఉండాలని హితవు పలికారు. పదవులు తీసుకున్నంత మాత్రాన ఆ ప్రేమ మారకూడదని పేర్కొన్నారు.