Mamata Banerjee: రాష్ట్రం పేరు మార్పు, కరోనా వ్యాక్సిన్ లపై ప్రధానితో మాట్లాడాను: మమతా బెనర్జీ
- మోదీతో భేటీ అయిన మమతా బెనర్జీ
- పెగాసస్ పై మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తే బాగుంటుందన్న దీదీ
- ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని వ్యాఖ్య
ప్రధాని మోదీతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయిన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ. మర్యాదపూర్వకంగానే ప్రధానితో సమావేశమయ్యానని చెప్పారు. రాష్ట్రానికి మరిన్ని కరోనా వ్యాక్సిన్ డోసులు అవసరమని కోరానని తెలిపారు. పశ్చిమబెంగాల్ పేరు మార్పు అంశాన్ని లేవనెత్తానని చెప్పారు. పేరు మార్పు అంశాన్ని పరిశీలిస్తానని ఆయన అన్నారని తెలిపారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పెగాసస్ అంశంపై ప్రధాని అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని ఆమె చెప్పారు. ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని అన్నారు. మరోవైపు పెగాసన్ అంశంపై ఇప్పటికే మమతా బెనర్జీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. పెగాసస్ వ్యవహారంలో మోదీ మౌనంగా ఉన్నారని... అందుకే తాము విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశామని ఆ సందర్భంగా ఆమె చెప్పారు.