Devineni Uma: అర్ధరాత్రి దేవినేని ఉమ అరెస్ట్.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు
- తనకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారన్న దేవినేని
- కారులో కూర్చుని అరగంటపాటు ఆందోళన
- దేవినేని ఉద్దేశపూర్వకంగానే అలజడి సృష్టించారన్న డీఐజీ
- ఉమ విషయంలో వందశాతం పారదర్శకంగా వ్యవహరిస్తామన్న ఎస్పీ
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావును గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఉమ నిన్న పరిశీలనకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద దేవినేని కారును కొందరు అడ్డుకుని చుట్టుముట్టి దాడికి దిగారు.
వైసీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అనుచరులే తనపై దాడికి పాల్పడినట్టు ఉమ ఆరోపించారు. అనంతరం తనకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ జి.కొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కారులో కూర్చునే దాదాపు అరగంటపాటు ఆయన ఆందోళనకు దిగారు.
అర్ధరాత్రి తర్వాత వాహనం అద్దాలను తొలగించిన పోలీసులు దేవినేనిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉమా అరెస్టుపై టీడీపీ భగ్గుమంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తి కారు అద్దాలు బద్దలుగొట్టి అరెస్ట్ చేయడం దారుణమని ఆ పార్టీ నేత కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ఇది నిదర్శనమని అన్నారు.
ఉమ అరెస్ట్‌పై డీఐజీ మోహన్‌రావు స్పందిస్తూ.. ఆయన ఉద్దేశపూర్వకంగానే అలజడి సృష్టించారని అన్నారు. ఉమా విషయంలో నూటికి నూరుశాతం పారదర్శకంగా విచారిస్తామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చెప్పారు. ఉమ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్టు తెలిపారు.