Andhra Pradesh: దాడి చేసినవారిని వదిలేసి.. ఉల్టా కేసులు పెడతారా?: పోలీసులపై లోకేశ్ మండిపాటు
- వైసీపీ సెక్షన్ల కింద బాధితులను అరెస్ట్ చేస్తారా?
- రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రయోగించి అరెస్ట్
- మాజీ మంత్రినే హింసిస్తే.. సామాన్యుల పరిస్థితేంటి?
- బాధితులనే నిందితులుగా మార్చిన దుర్మార్గమైన పోలీస్ వ్యవస్థ
ఏపీ ప్రభుత్వం, పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలన, మైనింగ్ మాఫియా, అవినీతి, అక్రమాలకు అడ్డుపడుతున్నారనే దేవినేని ఉమపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. దాడి చేసిన వారిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టాల్సిన పోలీసులు.. వైసీపీ సెక్షన్ల కింద దేవినేని ఉమపైనే ఉల్టా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రయోగించి ఉమను అరెస్ట్ చేయించిందన్నారు. బాధితులనే నిందితులుగా మార్చిన దుర్మార్గమైన పోలీస్ వ్యవస్థ ఏపీలో ఉండడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఓ మాజీ మంత్రినే చట్ట వ్యతిరేకంగా ఇంతలా హింసిస్తే.. సామాన్యుల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
చట్టాన్ని చుట్టం చేసుకున్న పోలీసులూ.. తాడేపల్లి కొంప కనుసైగలే చట్టంగా నిర్ణయాలు తీసుకున్న మీ బాస్ కు పట్టిన గతే మీకూ పడుతుందంటూ లోకేశ్ హెచ్చరించారు. దానికి కొద్దిగా టైమ్ పడుతుందంతే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అన్యాయంగా ప్రవర్తిస్తున్నా.. న్యాయం ముందు దోషిగా నిలబడక తప్పదని లోకేశ్ హెచ్చరించారు.