Danam Nagender: హైకోర్టులో దానం నాగేందర్‌కు ఊరట.. ఆరు నెలల జైలు శిక్షను నిలిపివేస్తూ ఉత్తర్వులు
- 2013లో నమోదైన కేసులో దానంకు ఆరు నెలల జైలు శిక్ష
- శిక్షను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- బెయిలు విషయంలో కింది కోర్టు షరతులే వర్తిస్తాయన్న న్యాయస్థానం
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఎస్.సాంబశివరావు అనే వ్యక్తిపై దాడి చేసి, బెదిరించిన అభియోగాలపై 2013లో దానంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఈ నెల 7న విచారణ జరిపిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు దానంను దోషిగా తేల్చి ఆరు నెలల జైలు శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధించింది.
ఈ తీర్పును నాగేందర్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిని విచారించిన జస్టిస్ జి.శ్రీదేవి దానంపై విధించిన ఆరు నెలల జైలు శిక్ష అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. బెయిలుకు సంబంధించి కింది కోర్టు విధించిన షరతులే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.