Vijay Sai Reddy: మా విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు: విజయసాయిరెడ్డి
- కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశం
- పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చ
- పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రధాన కార్యాలయం రాజమండ్రికి తరలింపుపై కూడా
కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్, నిధుల రీయింబర్స్‌మెంట్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రధాన కార్యాలయం రాజమండ్రికి తరలింపు తదితర అంశాలకు కేంద్ర మంత్రి అంగీకరించారని ఆయన చెప్పారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు విషయంలో సవరించిన అంచనాలకు ఆమోద ముద్ర వేయాలని తాము కోరామని ఆయన చెప్పారు.
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 'విశ్వసనీయత పాతాళంలోకి జారిపోయాక, ఇక ప్రజల దగ్గర తన పప్పులు ఉడకవని డిసైడై పోయాడు బాబు. అందుకే ప్రభుత్వాన్ని అప్రదిష్ఠ పాలుచేసే కుట్రలపై దృష్టి పెట్టాడు. ఈయన వాడకంలో మత్తు డాక్టర్ నుంచి నిమ్మగడ్డ దాకా ఎంతో మంది బలవుతూనే ఉన్నారు. నిండా మునిగినోడికి చలి ఏముంటుంది?' అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.