C Narayana Reddy: ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సినారె సుసంపన్నం చేశారు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- నేడు సి.నారాయణరెడ్డి జయంతి
- ఘన నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి, సీఎం కేసీఆర్
- సాహితీలోకంలో సినారెది ప్రత్యేకస్థానమన్న వెంకయ్య
- సినారె పేరిట సారస్వత సదనం నిర్మిస్తున్నట్టు కేసీఆర్ వెల్లడి
ఆధునిక తరం కవి, సుప్రసిద్ధ సినీ గీత రచయిత సి.నారాయణరెడ్డి (సినారె) జయంతి సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. సినారెకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సినారే సుసంపన్నం చేశారని కొనియాడారు. అదే సమయంలో సినీ సాహిత్యానికి గౌరవం తెచ్చిపెట్టారని, సినారెను తెలుగుజాతి తరతరాలు గుర్తుంచుకుంటుందని కీర్తించారు. సాహితీలోకంలో సినారెది ప్రత్యేక స్థానం అని, ఆయన నుంచి వచ్చిన రచనలు పాత తరానికి, కొత్త తరానికి మధ్య వారధిలా నిలిచాయని వివరించారు. తెలుగు కవుల్లో తాను సినారెను ఎంతో అభిమానిస్తానని వెంకయ్యనాయుడు తెలిపారు.
అటు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత సినారె జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఆయన సాహితీ సేవలకు గుర్తుగా హైదరాబాదులో సినారె సారస్వత సదనం నిర్మాణానికి తమ ప్రభుత్వం చర్యలు షురూ చేసిందని వెల్లడించారు. కవిగా, సినీ గీత రచయితగా అనేక సాహితీ ప్రక్రియల్లో రాణించి తెలుగు సాహిత్యాన్ని సమున్నతం చేశారని, గజల్ వంటి ఉర్దూ సాహితీ సంప్రదాయానికి గౌరవం ఇచ్చారని తెలిపారు. తెలంగాణ సాహిత్యాన్ని గంగాజమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలిపారని కొనియాడారు. తెలుగు భాషకు, తెలంగాణ సాంస్కృతిక రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని సీఎం కేసీఆర్ కీర్తించారు.