Andhra Pradesh: జీతం ఎప్పుడొస్తుందో కూడా తెలియట్లేదు.. పాలు, కూరగాయల వారి దగ్గర చులకనైపోతున్నాం: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు
- నాలుగు నెలలుగా ఎదురుచూపులే
- రాష్ట్రంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు
- 11వ పీఆర్సీ 37 నెలలు ఆలస్యమైంది
నాలుగు నెలలుగా జీతాలు సకాలంలో రాక ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. జీతాలు సమయానికి వచ్చేలా చూడాలని దేవుణ్ని వేడుకున్నానన్నారు.
రాష్ట్రంలో జీతాలు ఎప్పుడొచ్చేది తెలియట్లేదని, దీంతో పాలవారు, కూరగాయలవారి దగ్గర చులకన అవుతున్నామని అన్నారు. 11వ పీఆర్సీని జగన్ సర్కార్ వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే 37 నెలలు ఆలస్యం అయిందని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రకటించినట్టుగానే ఏపీలోనూ ప్రకటించాలన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ జీతాలు ఆలస్యం కాలేదని, ఒక జిల్లాలో ఒకరికి పింఛను పడితే.. ఇతర జిల్లాల్లో పడడం లేదని చెప్పారు.
ఫస్ట్ తారీఖు అంటే ఉద్యోగులకు పండుగ లాంటిదని, కానీ, ఫస్టున వేతనాలివ్వకుండా ఆ పండుగ లేకుండా చేస్తున్నారని ఆయన వాపోయారు. రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన బకాయిలూ అందడం లేదన్నారు. ఉద్యోగులకు జీతాలిచ్చేందుకైనా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని ఆయన కోరారు.