YS Sharmila: ఇళ్లను కూల్చి రెండు రోజులు అవుతున్నా..కేసీఆర్ దొర స్పందించ లేదు: షర్మిల
- పేదల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్కశంగా వ్యవహరిస్తున్నాయి
- కొత్తగూడెంలో పేదల ఇళ్లను బలవంతంగా కూల్చడం అమానుషం
- రైల్వే భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఎలా ఇచ్చారు?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నాయని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెంలో ఉదయం 4 గంటలకు జేసీబీలతో బలవంతంగా ఇళ్లను కూల్చడం అమానుషమని చెప్పారు. 130 కుటుంబాలు రోడ్డున పడితే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇళ్లను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నోటీసులు ఇచ్చి, ఇళ్లను కూల్చేస్తే బాధితులు ఎక్కడకు పోవాలని షర్మిల ప్రశ్నించారు. బాధితులకు ముందే ఇళ్లను కట్టించి ఇవ్వకుండా ఇంత కాలం ఏం చేశారని నిలదీశారు. రైల్వే భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇళ్ల కూల్చివేతలు జరిగి రెండు రోజులు అవుతున్నా కేసీఆర్ దొర ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అణచివేత సరికాదని అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. 'గూడు చెదిరి.. గుండె బరువై.. బతుకులు వీధిపాలు' అంటూ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని ఆమె షేర్ చేశారు.