Dharavat Mohan Gandhi: ఈటల బావమరిదిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేసిన టీఎస్ జీసీసీ చైర్మన్
- దళితులను కించపర్చారంటూ ఈటల బావమరిదిపై ఆరోపణలు
- అసభ్యంగా తిట్టారన్న మోహన్ గాంధీ
- తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్
- నీచ రాజకీయాలంటున్న బండి సంజయ్
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయాలు మరింత పదునెక్కాయి. ఈటల రాజేందర్ బావమరిది కొండవీటి మధుసూదన్ రెడ్డి దళితులను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశాడంటూ టీఎస్ జీసీసీ చైర్మన్ ధారావత్ మోహన్ గాంధీ ఆరోపిస్తున్నారు. మధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మోహన్ గాంధీ నేడు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
కాగా, మధుసూదన్ రెడ్డి పేరిట ఫేక్ సోషల్ మీడియా ఐడీలు సృష్టించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే స్పందించారు. ఈటల గెలుపును అడ్డుకునేందుకు నీచానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
డీజీపీని కలిసిన టీఎస్ జీసీసీ చైర్మన్ మోహన్ గాంధీ స్పందిస్తూ... ఈటల కోళ్ల పరిశ్రమ వ్యాపార భాగస్వామితో మధుసూదన్ రెడ్డి చేసిన చాటింగ్ లో దళితులను కించపరిచే వ్యాఖ్యలు ఉన్నాయని వెల్లడించారు. దళితులను అసభ్యంగా తిట్టారని, మధుసూదన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు.