Vishnu Vardhan Reddy: ప్రొద్దుటూరులో ఉండేది భారత రాజ్యాంగమా? లేక ఎమ్మెల్యే రాచమల్లు రాజ్యాంగమా?: విష్ణువర్ధన్ రెడ్డి
- ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రశ్నిస్తే బీజేపీ నేతలపై దాడులు
- కత్తులతో దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తారా?
- ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
- ఎమ్మెల్యే అనుచరుడు వైసీపీ నేత రవీంద్రా రెడ్డి, ఇతర నాయకులతో దాడి
'ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రశ్నిస్తే బీజేపీ నేతలను కత్తులతో దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తారా? ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు' అంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నిలదీశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలంలో ప్రభుత్వ పథకాలు తమకు అందడం లేదని లబ్ధిదారులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినందుకు దాడులు చేశారని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
'ఎమ్మెల్యే గారు మీ అనుచరుడు వైసీపీ నేత రవీంద్రా రెడ్డి, ఇతర నాయకులతో కలసి కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం సిగ్గుచేటు. ఈ సంఘటనలో బీజేపీ కార్యకర్తలు ప్రసాద్, నర్సింహులు, ఇతర కార్యకర్తలను కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరచారు. ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను శిక్షించాలి. లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతుంది' అని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.
'ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి, ఈ ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాను. నాడు సామాజిక మాధ్యమాల్లో మీకు వ్యతిరేకంగా అవినీతిని ప్రశ్నించాడని మీ ప్రైవేటు గూండాలు ఒకరిని హత్య చేశారు. నేడు మా నేతలు, కార్యకర్తలపైనా దాడి చేశారు. ప్రొద్దుటూరులో ఉండేది భారత రాజ్యాంగమా? లేక ఎమ్మెల్యే రాచమల్లు రాజ్యాంగమా?' అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. కాగా, ప్రొద్దుటూరులో జరిగిన ఘటనపై బీజేపీ ఏపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.