jagan: జగన్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ పై ముగిసిన విచారణ.. వచ్చే నెల 25న తీర్పు!

Arguments in Jagan bail cancellation petition over in CBI court
  • లిఖితపూర్వక సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కోరిన సీబీఐ
  • ఈరోజే ఏదో ఒకటి తేల్చేయాలన్న సీబీఐ కోర్టు
  • ఇకపై ఈ కేసులో వాదనలు వినిపించబోమన్న సీబీఐ
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ పై సీబీఐ కోర్టులో ఈరోజు వాదనలు ముగిశాయి. ఈ కేసుకు సంబంధించి ఆగస్ట్ 25న సీబీఐ కోర్టు తుది తీర్పును వెలువరించనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఈనాటి విచారణ సందర్భంగా పిటిషన్ పై లిఖిత పూర్వక సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ విన్నపం పట్ల రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వెంకటేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు సమయం కోరారని... ఇప్పటి వరకు సీబీఐ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చారని, ఇకపై గడువు ఇవ్వొద్దని కోరారు. దీంతో కోర్టు స్పందిస్తూ ఈరోజే ఏదో ఒకటి సీబీఐ చెప్పాలని, దీనికి కొంత సమయం ఇస్తామని చెప్పింది.

కాసేపటి తర్వాత సీబీఐ తరపు న్యాయవాది వచ్చి, ఈ కేసులో ఇకపై తాము ఎలాంటి వాదనలు వినిపించబోవడం లేదని... జగన్ బెయిల్ రద్దు చేయాలా? వద్దా? అనే నిర్ణయాన్ని విచక్షణ మేరకు కోర్టు తీసుకోవాలని కోరారు. అనంతరం ఈ కేసులో విచారణ ముగిసిందని జడ్జి ప్రకటించారు. ఆగస్టు 25న తుది తీర్పును వెలువరిస్తామని చెప్పారు. దీంతో, సీబీఐ కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వెలువడనుందో అనే ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నెలకొంది.
jagan
Disproportionate Assets Case
YSRCP
CBI
Bail
Raghu Rama Krishna Raju

More Telugu News