Salary: రేపటి నుంచి మారనున్న వేతనాలు, ఈఎంఐల నిబంధనలు.. ఆర్బీఐ చెప్పిన వివరాలివీ
- ఆదివారం సహా ఏ సెలవు దినమైనా వేతనం జమ
- అన్ని సెలవు దినాల్లోనూ ఈఎంఐల ప్రక్రియ
- వాటిని ప్రాసెస్ చేసే ‘నాచ్’ 24/7 సేవలు
ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు.. జీతాల కోసం కోట్లాది బతుకులు ఆశగా ఎదురు చూస్తుంటాయి. కానీ, ఆ రోజు ఏ పండుగో, ఆదివారమో లేదంటే రెండో శనివారమో వస్తే! ఆ వేతన జీవి గుండెల్లో గుబులు పట్టుకుంటుంది. అందుకే ఇక ఇలాంటి టెన్షన్లేవీ ఉండకుండా.. ఏ సెలవు దినాల్లోనైనా వేతనాలు మన ఖాతాల్లో పడేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల్లో సవరణలు చేసింది. ఈఎంఐల రూల్స్ నూ మార్చింది.
ఆదివారం, ఇతర ఏ సెలవు దినాల్లోనైనా మన ఖాతాల్లో వేతనాలు పడతాయి. ఈఎంఐలు కట్ అవుతాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కొత్త రూల్స్ ను వెల్లడించారు. జీతాలు, ఈఎంఐలను ప్రాసెస్ చేసే నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్– ఎన్ఏసీహెచ్) ఆగస్టు 1 నుంచి వారంలో ఏడు రోజుల పాటు పనిచేస్తుందని, అన్ని సెలవు దినాల్లోనూ నాచ్ కార్యకలాపాలు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
వినియోగదారుల సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. జీతాలు, బిల్లులు, బీమా, ఈఎంఐ చెల్లింపుల ప్రక్రియనూ ఇది సరళతరం చేస్తుందన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ నాచ్ ద్వారానే మన ఖాతాల్లో డివిడెండ్, వడ్డీ వంటివి జమ అవుతుంటాయి. ఇల్లు లేదా ఇతర రుణాల ఈఎంఐలకు సంబంధించిన ప్రక్రియ కూడా ఇక్కడి నుంచే సాగుతుంది.
అలాంటి ఈ నాచ్.. కేవలం బ్యాంక్ పనిదినాల్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తుండడం వల్ల చాలా చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రోజుల్లోనూ సామాన్యులకు జీతాలు పడేలా, ఈఎంఐలు ప్రాసెస్ అయ్యేలా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ (ఆర్టీజీఎస్), నాచ్ సేవలను 24 గంటలూ అందించనుంది.