JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదు
- నిన్న మీడియాతో మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి
- మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఫిర్యాదు
- సెక్షన్ 153ఏ, 506 కింద కేసుల నమోదు
వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జేసీ సోదరులను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని కేసుల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి జైలులో కూడా ఉండి వచ్చారు. జైలు నుంచి విడుదలైన వెంటనే ఆయనపై పోలీసులు కొత్త కేసులు పెట్టడం కూడా తెలిసిందే. గత ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించిన తర్వాత తాడిపత్రిలో జేసీ సోదరుల పని అయిపోయిందని అందరూ భావించారు.
అయితే, తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి... జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. నిన్న రెండో ఉప ఛైర్మన్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో సైతం జేసీ సోదరులు తమ సత్తా చాటారు. ఆ పదవిని సైతం కైవసం చేసుకున్నారు.
మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో పోలీసు కేసు నమోదయింది. మీడియా ముఖంగా మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తాడిపత్రి పోలీసులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.