Babul Supriyo: రాజకీయాలకు ఇక సెలవు... సంచలన నిర్ణయం తీసుకున్న బీజేపీ నేత బాబుల్ సుప్రియో
- ఇటీవల మోదీ క్యాబినెట్ విస్తరణ
- కేంద్ర సహాయమంత్రి పదవిని కోల్పోయిన సుప్రియో
- రాజకీయాలకు గుడ్ బై అంటూ ఫేస్ బుక్ పోస్టు
- ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని వెల్లడి
బెంగాల్ బీజేపీ నేత బాబుల్ సుప్రియో సంచలన ప్రకటన చేశారు. తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. బాబుల్ సుప్రియో ఇటీవలి వరకు కేంద్ర సహాయమంత్రిగా కొనసాగారు. కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఆయన పదవి పోయింది. ఈ నేపథ్యంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెబుతున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఆయన అసన్ సోల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు.
కాగా, బాబుల్ సుప్రియో తన తాజా నిర్ణయాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లబోవడంలేదని స్పష్టం చేశారు. టీఎంసీ, కాంగ్రెస్, సీపీఎం... మరే ఇతర పార్టీ కూడా తనను ఆహ్వానించలేదని, తాను కూడా ఏ పార్టీలోనూ చేరట్లేదని తెలిపారు. ఎక్కడైనా గానీ, ఒకరు సామాజిక సేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదని సుప్రియో అభిప్రాయపడ్డారు.
బాబుల్ సుప్రియో రాజకీయాల్లోకి రాకముందు బాలీవుడ్ లో ప్రముఖ గాయకుడిగా గుర్తింపు పొందారు. సంగీత కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన సుప్రియో, బాల్యం నుంచే ప్రతిభ చూపారు. బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో పాటలు పాడారు. పలు ఆల్బంలు రూపొందించడమే కాకుండా, దేశవిదేశాల్లో అనేక స్టేజ్ షోల్లో పాల్గొన్నారు.