Venkaiah Naidu: తెలుగు భాష ప్రాధాన్యతపై మరోసారి గళం వినిపించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- తెలుగు కూటమి ఆధ్వర్యంలో ఆన్ లైన్ సదస్సు
- హాజరైన వెంకయ్యనాయుడు
- కుటుంబ సభ్యులు తెలుగులో మాట్లాడాలని పిలుపు
- కోర్టుల్లోనూ మాతృభాష వినిపించాలని ఆకాంక్ష
తెలుగు భాషపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఉన్న మమకారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తాను పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ తెలుగు భాష ప్రాశస్త్యం, భాషను సజీవంగా నిలుపుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుతుంటారు. తాజాగా తెలుగు కూటమి నిర్వహించిన ఓ వెబినార్ లో ఆయన పాల్గొన్నారు.
ఈ ఆన్ లైన్ సదస్సులో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ.... మొదట కుటుంబ సభ్యులు తెలుగులోనే మాట్లాడుకోవాలని సూచించారు. మాతృభాషను కాపాడుకోవడంలో అనేక దేశాలు అనుసరిస్తున్న విధానాలను గమనించాలని పేర్కొన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలని, పరిపాలన వ్యవహారాల్లోనూ మాతృభాష ప్రతిబింబించాలని తన మనోభావాలను పంచుకున్నారు. న్యాయస్థానాల్లోనూ తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, సాంకేతిక విద్యాకోర్సులు తెలుగులో ఉండాలని అభిలషించారు. ముఖ్యంగా, మాతృభాష పరిరక్షణకు వినూత్న మార్గాల్లో ప్రయత్నించాలని ఉద్బోధించారు.