Telangana: బలహీనంగా రుతుపవన కదలికలు.. తెలంగాణలో నేడు, రేపు ఓ మాదిరి వర్షాలు
- రాష్ట్రంలో ఇటీవల విస్తారంగా వర్షాలు
- నేడు, రేపు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు
- సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో అత్యధికంగా 2 సెం.మీ. వర్షపాతం నమోదు
తెలంగాణలో ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలు గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టాయి. రుతుపవన కదలికలు బలహీనంగా ఉండడమే అందుకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల వ్యవధిలో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షం కురవగా, వనపర్తి జిల్లాలోని పాన్‌గల్‌లో ఒక సెంటీమీటరు వర్షం కురిసింది. మరోవైపు, పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.