PV Sindhu: ఫైనల్ ఆడే చాన్స్ కోల్పోయినందుకు బాధపడాలో, కాంస్యం గెలిచినందుకు సంతోషించాలో అర్థం కావడంలేదు: పీవీ సింధు

PV Sindhu express her feelings after won bronze in Tokyo Olympics
  • టోక్యో ఒలింపిక్స్ లో సింధుకు కాంస్యం
  • దేశం కోసం పతకం తెచ్చినందుకు సంతోషంగా ఉందన్న సింధు
  • బింగ్జియావోతో సర్వశక్తులు ఒడ్డి పోరాడినట్టు వెల్లడి
  • అభిమానులకు కృతజ్ఞతలు
టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో నిన్న సెమీస్ లో ఓడిన తెలుగుతేజం పీవీ సింధు, మూడోస్థానం కోసం పోరులో అద్భుతంగా ఆడి కాంస్యం సాధించింది. అయితే, ఈ విజయం అనంతరం మాట్లాడుతూ... తనను మిశ్రమ భావాలు చుట్టుముడుతున్నాయని సింధు వెల్లడించింది. ఒలింపిక్స్ వంటి విశ్వవేదికపై బ్యాడ్మింటన్ ఫైనల్లో ఆడే చాన్స్ కోల్పోయినందుకు బాధపడాలో, కాంస్యం నెగ్గినందుకు సంతోషించాలో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించింది. అయితే, ఈ కాంస్యం ఇన్నేళ్ల తన కష్టానికి ప్రతిఫలంగానే భావిస్తానని స్పష్టం చేసింది.

బింగ్జియావోతో మ్యాచ్ కు ముందు తనలో తీవ్ర భావోద్వేగాలు కలిగాయని, అయితే, మ్యాచ్ లో అవన్నీ పక్కనబెట్టి ఆటపైనే దృష్టి కేంద్రీకరించానని సింధు వెల్లడించింది. సర్వశక్తులు ఒడ్డి ఆడానని, దేశం కోసం పతకం సాధించింనందుకు ఆనందంగా ఉందని పేర్కొంది.

అన్ని సమయాల్లోనూ తన వెన్నంటే నిలిచి, తనపై ప్రేమ చూపిస్తున్నందుకు అభిమానులకు సదా రుణపడి ఉంటానని సింధు వినమ్రంగా తెలియజేసింది. ఈ విజయం వెనుక కుటుంబ సభ్యుల కష్టం, స్పాన్సర్ల ప్రోత్సాహం ఉందని వెల్లడించింది.

కాగా, టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ స్వర్ణాన్ని చైనాకు చెందిన చెన్ యుఫెయ్ ఎగరేసుకెళ్లింది. ఫైనల్లో చెన్... చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్ ను మట్టికరిపించింది.
PV Sindhu
Bronze
Badminton
Tokyo Olympics
India

More Telugu News