India: కొవిడ్ నివారణలో అశ్వగంధ పాత్రపై బ్రిటన్‌లో క్లినికల్ ట్రయల్స్
- భారత ఆయుర్వేద సంస్థ, యూకే ఎల్ఎస్‌హెచ్‌టీఎం మధ్య ఒప్పందం
- 2 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్
- విజయవంతమైతే భారత ఆయుర్వేద వైద్యానికి అంతర్జాతీయ గుర్తింపు
భారత ప్రాచీన వైద్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఆయుర్వేద ఔషధం అశ్వగంధ కరోనాకు ఏమేరకు అడ్డుకట్ట వేస్తుందన్న దానిపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఓ విదేశీ సంస్థతో కలిసి అధ్యయనం చేయనుంది. ఇందుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ బ్రిటన్‌లో జరగనున్నాయి.
ఈ మేరకు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ), లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్ఎస్‌హెచ్‌టీఎం) సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా లండన్, లీసెస్టర్, బర్మింగ్‌హామ్ నగరాల్లో రెండు వేలమందిపై అశ్వగంధ ఔషధంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు.
ఒక గ్రూపులోని 1000 మంది వలంటీర్లకు మూడు నెలలపాటు అశ్వగంధ మాత్రలు అందిస్తారు. మరో వెయ్యి మందికి అశ్వగంధను పోలి ఉండే ప్లేసిబో (ప్రభావం లేని మందు)ను అందిస్తారు. వారు ఏ మాత్ర తీసుకుంటున్నారనేది వలంటీర్లకే కాకుండా, వారిని పరిశీలించే వైద్యులకు కూడా తెలియదు. వీరికి రోజుకు 500 మిల్లీగ్రాముల మాత్రలను రోజుకు రెండుసార్లు చొప్పున ఇస్తారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేస్తారని ఏఐఐఏ డైరెక్టర్ తనూజ మనోజ్ తెలిపారు. ఈ క్లినికల్ ట్రయల్స్ కనుక విజయవంతమైతే మన ప్రాచీన అశ్వగంధ ఔషధానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది.