Nara Lokesh: మునిసిపల్ కార్మికులను అరెస్ట్ చేసి జైలుకి పంపడం సరికాదు: వీడియో పోస్ట్ చేసిన లోకేశ్
- దొంగల్ని పెట్టినట్టు కార్మికులను లాకప్ లో బంధించారు
- వైకాపా ప్రభుత్వానిది దుర్మార్గపు చర్య
- ఐదు నెలల జీతం రాకపోతే కడుపు మండదా?
మునిసిపల్ కార్మికులను అరెస్ట్ చేసి జైలుకి పంపడం సరికాదని, జీతాలు రాకపోవడంతో నిరసన తెలిపిన వారిపట్ల వైసీపీ ప్రభుత్వ తీరు అన్యాయంగా ఉందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. మునిసిపల్ కార్మికులను అరెస్టు చేసిన వీడియోను ఆయన పోస్ట్ చేస్తూ వైసీపీ తీరును ఆయన నిలదీశారు.
'మునిసిపల్ కార్మికులను అరెస్ట్ చేసి జైలుకి పంపడం వైఎస్ జగన్ మూర్ఖత్వానికి పరాకాష్ఠ. దొంగల్ని పెట్టినట్టు కార్మికులను లాకప్ లో బంధించడం వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు చర్య. జీతం వస్తే కానీ పూట గడవని జీవితాలు వారివి. అలాంటిది ఐదు నెలల జీతం రాకపోతే కడుపు మండదా?' అని లోకేశ్ ప్రశ్నించారు.
'న్యాయబద్ధంగా రావాల్సిన జీతాల బకాయిలు చెల్లించాలని నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? మునిసిపల్ కార్మికులను అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు' అని లోకేశ్ చెప్పారు.
'నాలుగు రోజులు రిలే నిరాహారదీక్షలు చేసినా పట్టించుకోకపోగా, కనీసం వారి సమస్య గురించి వినడానికి కూడా ఉన్నతాధికారులకు మనస్సు రాలేదు. వెంటనే మునిసిపల్ కార్మికులకు బకాయి ఉన్న జీతాలు చెల్లించాలి. అరెస్ట్ చేసిన కార్మికులను తక్షణమే విడుదల చెయ్యాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.