Sharmila: చచ్చేది నా వాడు కాదు కదా? అని భావిస్తున్నారు: కేసీఆర్పై షర్మిల తీవ్ర విమర్శలు
- నిరుద్యోగుల చావుకు కారణం నిరుద్యోగం
- నిరుద్యోగానికి కారణం కేసీఆర్ గారు
- నిరుద్యోగ చావులన్నీ ప్రభుత్వ హత్యలే
- కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు
'నా చావుకు కారణం నిరుద్యోగం' అంటూ తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుపుతూ ఈనాడులో వచ్చిన ఓ వార్తను పోస్ట్ చేసిన వైఎస్ షర్మిల... కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు. ఉద్యోగం సాధించలేకపోయానంటూ ఓ యువకుడు రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారని ఆ కథనంలో పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన నిన్న చోటుచేసుకుందని ఆ కథనంలో చెప్పారు. ఆ యువకుడు ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన నిరుద్యోగి మహ్మద్ షబ్బీర్ (26)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనను షర్మిల ప్రస్తావించారు.
'నిరుద్యోగుల చావుకు కారణం నిరుద్యోగం.. నిరుద్యోగానికి కారణం కేసీఆర్ గారు, నిరుద్యోగ చావులన్నీ ప్రభుత్వ హత్యలే.. నిరుద్యోగుల చావులకు కారణమౌతున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదివికి అనర్హుడు. ఉద్యోగాలు నింపటం చేతకాని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి' అని షర్మిల డిమాండ్ చేశారు.
'రాష్ట్రంలో రోజుకో నిరుద్యోగి ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకొంటుంటే, కేసీఆర్ గారికి దున్నపోతు మీద వానపడ్డట్టు ఉంది. ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. ఈ రోజు 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నా నిరుద్యోగులు చస్తూ ఉన్నా.. చచ్చేది నా వాడు కాదు కదా అంటున్న కేసీఆర్ ఈ నిరుద్యోగుల చావులకు కారకుడు' అని షర్మిల విమర్శించారు.
కాగా, తెలంగాణలో లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ షర్మిల వారానికి ఒక రోజు నిరాహార దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం-నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష కార్యక్రమంలో ఆమె రేపు కూడా పాల్గొననున్నారు.