Alok Verma: సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై చర్యలు తీసుకోండి: కేంద్ర ప్రభుత్వం
- సర్వీసు కాలంలో నిబంధనలు ఉల్లంఘించారన్న కేంద్రం
- పెనాల్టీ విధించాలని సూచన
- యూపీఎస్సీకి సిఫారసు చేసిన కేంద్రం
సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై చర్యలు తీసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. అధికార దుర్వినియోగం, సర్వీసు నిబంధనల ఉల్లంఘన తదితర ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. అలోక్ వర్మపై 2018లో అప్పటి సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా చేసిన అవినీతి ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో అలోక్ వర్మపై చర్యలను ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలను జారీ చేసింది.
అలోక్ వర్మ తన సర్వీసు కాలంలో నిబంధనలను ఉల్లంఘించారని తన సిఫారసులో కేంద్రం పేర్కొంది. వర్మ చేసిన పనులకు పెనాల్టీ విధించాలని సూచించింది. ఈ సిఫారసులు ఆమోదం పొందినట్టైతే వర్మ పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్లపై ప్రభావం పడుతుంది. మరోవైపు పెగాసస్ లిస్టులో కూడా అలోక్ వర్మ పేరు ఉండటం గమనార్హం.