Corona Virus: ఈ నెలలోనే కరోనా మూడో ఉద్ధృతి.. ఐఐటీ పరిశోధకుల హెచ్చరిక
- అక్టోబరులో గరిష్ఠ స్థాయిని తాకనున్నఉద్ధృతి
- రోజుకు లక్షల వరకు కేసుల నమోదు
- వ్యాక్సినేషన్ జోరు పెంచాలంటున్న నిపుణులు
- ప్రస్తుతం రోజుకు 40 వేలకు పైగా కేసులు
రెండో దశలో దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన కరోనా వైరస్ మూడో దశలో విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉందని హైదరాబాద్, కాన్పూరు ఐఐటీ పరిశోధకులు హెచ్చరించారు. అయితే, రెండో దశతో పోలిస్తే దీని తీవ్రత కొంత తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పడం కొంత ఊరటనిచ్చే అంశం.
ఈ నెలలోనే తాకే మూడో ఉద్ధృతి.. అక్టోబరులో తీవ్రస్థాయికి చేరుతుందని అంచనా వేశారు. ఆ సమయంలో దేశంలో రోజువారీ కేసుల సంఖ్య లక్షలోపు ఉంటుందని వివరించారు. అయితే, పరిస్థితి మరింత దిగజారితే కనుక కేసుల సంఖ్య 1.5 లక్షల వరకు చేరుకుంటుందని విద్యాసాగర్ (హైదరాబాద్ ఐఐటీ), మణీంద్ర అగర్వాల్ (కాన్పూరు ఐఐటీ) నేతృత్వంలోని బృందం వివరించింది.
దేశంలో ఈ ఏడాది మే 7న సెకండ్ వేవ్ గరిష్ఠస్థాయిని తాకింది. అప్పట్లో రోజుకు అత్యధికంగా 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. థర్డ్ వేవ్‌కు అడ్డుకట్ట వేసేందుకు వైరస్ హాట్‌స్పాట్లను గుర్తించాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు. రెండో దశ మొదలై ఇప్పటికి 5 నెలలు గడిచాయి. ప్రస్తుతం 40 వేల కేసులు నమోదవుతున్నాయి. వీటిలో దాదాపు సగం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో కనుక ఇన్ఫెక్షన్లు పెరిగితే కేసుల సంఖ్య మరోమారు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.