Varla Ramaiah: వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో జరిగేలా చూడాలి: వర్ల రామయ్య

YS Viveka murder case enquiry has to be done in presence of sitting judge demands Varla Ramaiah
  • గతంలో సీబీఐ కేసులు ఏమయ్యాయో మనకు కొన్ని అనుభవాలు ఉన్నాయి
  • జగన్ పాలనలో భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోయింది
  • దేవినేని ఉమ అరెస్ట్ పై జాతీయ మానవహక్కుల కమిషన్ కు లేఖ రాస్తున్నాం
గత రెండున్నరేళ్లుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోందని... అయితే, సీబీఐ విచారించిన కేసులు గతంలో ఏమయ్యాయో మనకు కొన్ని అనుభవాలు ఉన్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఆ అనుభవాల నేపథ్యంలో వివేక హత్య కేసు విచారణ పర్యవేక్షణను సిట్టింగ్ జడ్జికి అప్పగించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ వారిని కోరుతున్నానని చెప్పారు. ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన, ఆర్టికల్ 19 దుర్వినియోగంపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ కు లేఖ రాస్తున్నట్టు చెప్పారు.

జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. జగన్ అరాచకం చేస్తున్నప్పటికీ ఆయనకు అందరూ జీహుజూర్ అనాలని డీజీపీ భావిస్తున్నారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఏపీలో ఆర్టికల్ 19 రద్దయినట్టు తమకు అనిపిస్తోందని చెప్పారు. టీడీపీ నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని అన్నారు. గతంలో అమరావతికి బస్సులో చంద్రబాబు వెళుతుండగా కొందరు దుండగులు ఆయన వాహనంపై దాడి చేశారని... విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్నారని... ఈ దాడులపై కూడా డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

కొండపల్లి అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమపై దాడి చేసి, ఆయనపైనే తప్పుడు కేసులు బనాయించారని వర్ల మండిపడ్డారు. ఈ వ్యవహారంపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ హెచ్ఎల్ దత్తుకు లేఖ రాస్తున్నామని చెప్పారు.
Varla Ramaiah
Telugudesam
Jagan
YSRCP
Chandrababu
Devineni Uma
National Human Rights Commission

More Telugu News