Raghunandan Rao: హరీశ్ రావు డ్రామాలకు అప్పట్లో శ్రీకాంతాచారి బలయ్యాడు: రఘునందన్ రావు 

Raghunandan Rao fires on Harish Rao

  • ఈటల కాలు ఆపరేషన్ పై హరీశ్ దిగజారి మాట్లాడారు
  • నిరాహారదీక్ష సమయంలో ఆసుపత్రిలో కేసీఆర్ జ్యూస్ తాగింది నిజం కాదా?
  • వైయస్ ని కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు హరీశ్ సిద్ధమయ్యారు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాలు ఆపరేషన్ పై మంత్రి హరీశ్ రావు దిగజారి మాట్లాడటాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. హరీశ్ రావు డ్రామాలకు అప్పట్లో శ్రీకాంతాచారి బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పుడు పెట్రోల్ కొనుక్కున్న హరీశ్ రావు 50 పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోకపోవడం కూడా డ్రామాలో భాగమేనని అన్నారు. హరీశ్ ది డ్రామా అని తెలియని శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎమ్మెల్సీ పదవికి అర్హురాలు కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కౌశిక్ రెడ్డిది కీలక పాత్ర అని కేసీఆర్ భావించినట్టున్నారని మండిపడ్డారు.

నిరాహారదీక్షకు దిగిన కేసీఆర్ ఖమ్మం ఆసుపత్రిలో జ్యూస్ తాగింది నిజం కాదా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆసుపత్రిలో జ్యూస్ ఇచ్చిన డాక్టర్ కు కేసీఆర్ గులాబీ కండువా కప్పలేదా? అని నిలదీశారు. 2008లో రాజశేఖరరెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు హరీశ్ సిద్ధమయ్యారని... అలాంటి హరీశ్ తో చెప్పించుకునే స్థితిలో తాము లేమని అన్నారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ పదవిని కేసీఆర్ ఇప్పించారా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెపుతుందని వ్యాఖ్యానించారు. మాదిగ సామాజికవర్గానికి కేబినెట్ లో స్థానం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాత్ర, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రను వాయిదా వేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News