Chattisgarh: పోలీసుల లక్ష్యంగా మందుపాతర.. పేలిన సామాన్యుల వాహనం.. పలువురికి గాయాలు!
- ఛత్తీస్ గఢ్ లోని ఘోతియాలో ఘటన
- 12 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
- వివరాలు వెల్లడించిన దంతేవాడ ఎస్పీ
పోలీసులను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు పెట్టిన మందుపాతరకు.. సామాన్య ప్రజలు వెళ్తున్న వాహనం బలైంది. ఈ రోజు ఉదయం ఛత్తీస్ గఢ్ లోని ఘోతియాలో జరిగిన ఈ దాడిలో 12 మంది గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మాలేవాదీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోతియా గ్రామంలో ఉదయం 7.35 గంటలకు నారాయణపూర్ నుంచి దంతేవాడకు కొత్తగా వేస్తున్న రోడ్డుపై మావోయిస్టులు మందుపాతర పేల్చారని దంతేవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. దాడికి గురైన వాహనం నారాయణపూర్ నుంచి వస్తోందని, దంతేవాడకు వెళ్తోందని ఎస్పీ చెప్పారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. వాస్తవానికి ఆ దాడి పోలీసులను లక్ష్యంగా చేసుకున్నదని, కానీ, అదే సమయంలో అటువైపు వచ్చిన సామాన్యుల వాహనం దాడికి గురైందని చెప్పారు.