Ravi Kumar Dahiya: టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో రజతం... రెజ్లింగ్ ఫైనల్లో ఓడిన రవికుమార్
- 57 కిలోల రెజ్లింగ్ లో ముగిసిన ఫైనల్
- ఉగుయేవ్ చేతిలో ఓటమిపాలైన రవికుమార్
- రవికుమార్ కు రజతం
- ఐదుకు పెరిగిన భారత్ పతకాల సంఖ్య
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఫైనల్లో భారత యోధుడు రవికుమార్ దహియాకు రజతం లభించింది. స్వర్ణం కోసం జరిగిన పోరులో రవికుమార్ రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) జట్టుకు చెందిన జవూర్ ఉగుయేవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ ఫైనల్ పోరులో ఉగుయేవ్ కు 7 పాయింట్లు దక్కగా, రవికుమార్ 4 పాయింట్లే సాధించి రజతంతో సరిపెట్టుకున్నాడు.
కాగా, భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో ఇది రెండో రజతం. ఇంతకుముందు మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు తొలి రజతం అందించింది. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు రెండు రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించి, ఓవరాల్ పతకాల పట్టికలో 62వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చైనా 33 స్వర్ణాలతో అగ్రస్థానంలో ఉండగా, 27 బంగారు పతకాలతో అమెరికా రెండో స్థానంలో ఉంది.