Devineni Uma: మా కార్యకర్తలు, నాయకులు నన్ను బతికించి హైవే మీదికి తీసుకొచ్చారు: దేవినేని ఉమ
- రాజమండ్రి జైలు నుంచి ఉమ విడుదల
- మీడియా సమావేశం ఏర్పాటు
- కొండపల్లిలో అక్రమ మైనింగ్ పై పునరుద్ఘాటన
- భయపడేది లేదని స్పష్టీకరణ
రాజమండ్రి జైలు నుంచి విడుదలైన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందన్నది వాస్తవం అని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆయన బావమరిది, అనుచరులు మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మైనింగ్ కు సంబంధించి రూ.10 లక్షలు జరిమానా చెల్లించినట్టు కృష్ణప్రసాదే అంగీకరించాడని ఉమ తెలిపారు.
"కమిటీ సభ్యులందరం కొండపల్లి వెళ్లి అక్కడి వాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు చెప్పాం. ఎందుకు ప్రభుత్వం ఉలిక్కిపడింది? జగన్ ఎందుకు కలెక్టర్ ను అక్కడికి పంపించలేకపోతున్నారు? జే ట్యాక్స్ తీసుకుంటున్నందుకా? అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్లడంలేదు?" అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నవారి జేసీబీలు, లారీలను వదిలేశారని ఆరోపించారు. ఇందులో ఉన్న దళిత, చిన్న ఉద్యోగులను మాత్రం సస్పెండ్ చేశారని, తప్పు చేసిన వాళ్లను మాత్రం కాపాడుతున్నారని వివరించారు.
"జగన్ మోహన్ రెడ్డీ... దాదాపు గంటన్నర సేపు కారుపై రాళ్లు వేయించావు. అది కూడా పోలీసుల సమక్షంలో రాళ్లు వేయించావు. మా సంగతి దేవుడికి వదిలేయండి, మీ పోలీసులపైనే ఆ ఘటనలో రాళ్లు పడితే, అక్కడికి దగ్గర్లోనే ఉన్న పోలీసులు రాలేదు. మీ పోలీసులకు దెబ్బలు తగులుతుంటేనే పోలీసులు రాలేదు. కానీ నన్ను మా కార్యకర్తలు, నేతలు బతికించి నేషనల్ హైవే పైకి తీసుకొచ్చారు.
ఈ సంఘటన జరుగుతున్నంత సేపు చంద్రబాబు రెండుసార్లు ఫోన్ చేసి మాకు ధైర్యం చెబుతూనే ఉన్నారు. పలు పోలీస్ స్టేషన్లకు నన్ను తిప్పి దాదాపు 15 గంటలు కూర్చోబెట్టారు. హడావుడిగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లి, అక్కడి సూపరింటిండెంట్ ను మార్చారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. టీడీపీ కార్యకర్తలు, నేతల ధైర్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దు" అని స్పష్టం చేశారు.