Corona Virus: హుజూరాబాద్‌లో రాజకీయ వేడి.. పెరిగిన కరోనా కేసులు
- రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటిన్నర మందికి వ్యాక్సినేషన్ పూర్తి
- రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందన్న డాక్టర్ శ్రీనివాస్
- హుజూరాబాద్‌లో కేసుల పెరుగుదలపై కలెక్టర్‌తో త్వరలో సమీక్ష
త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా వివిధ పార్టీలన్నీ తమ కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. నాయకులు, కార్యకర్తల రాకపోకలు, సమావేశాలతో హుజూరాబాద్ ప్రతిరోజూ కిక్కిరిసిపోతోంది.
ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు గాలికి వదిలేస్తుండడంతో, నియోజకవర్గంలో మళ్లీ కొత్త కేసుల పెరుగుదల మొదలైంది. హుజూరాబాద్‌లో కేసుల పెరుగుదల మొదలైనట్టు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. కేసుల పెరుగుదలపై కలెక్టర్‌తో సమీక్షించనున్నట్టు పేర్కొన్నారు.
అయితే, రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం కొవిడ్-19 అదుపులోనే ఉందన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని సందర్శించిన శ్రీనివాస్ అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటిన్నర మందికి కరోనా టీకాలు వేసినట్టు ఆయన తెలిపారు.