rbi: వడ్డీరేట్లు యథాతథం.. ఆర్‌బీఐ కీలక నిర్ణయాలు
- ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటన
- రెపోరేటు 4 శాతం, రివర్స్ రెపోరేటు 3.35 శాతం
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా అంచనా
- 2021-22లో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.7 శాతం
కరోనా ప్రభావం కారణంగా ప్రస్తుతం ఉన్న రెపోరేటు, రివర్స్ రెపోరేటులను యథాతథంగా కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ సూచించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నట్టుగానే రెపోరేటు 4 శాతం, రివర్స్ రెపోరేటు 3.35 శాతంగానే కొనసాగుతాయని తెలిపారు.
కరోనా పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టినా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉండనుందని, గత సమీక్షకు తాజా అంచనాలకు ఎలాంటి మార్పు లేదని చెప్పారు.
ఆర్‌బీఐ ప్రకటించిన ఈ సర్దుబాటు విధానానికి ఎంపీసీ కమిటీలో ఏకగ్రీవ ఆమోదం లభించలేదని తెలిపారు. ఈ ఏడాది మే నెలలో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ధరల పెరుగుదలలో కాస్త స్థిరత్వం వచ్చిందని వివరించారు.
ప్రస్తుతం దేశంలో వ్యవసాయ సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండంతో పాటు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పెద్ద ఎత్తున సాగుతుండటంతో త్వరలోనే ఆర్థిక వ్యవస్థ పూర్వ స్థితికి చేరుకుంటుందని శక్తికాంతదాస్ అన్నారు. పెట్రోలు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని వివరించారు.
స్థూలంగా విపణిలో డిమాండ్ పుంజుకుంటుందని, అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా బలహీనంగానే ఉన్నాయని చెప్పారు. సరఫరా-గిరాకీ మధ్య సమతుల్యత కోసం మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉందని తెలిపారు. 2021-22లో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉండనుందని చెప్పారు.
అలాగే, రెండో త్రైమాసికంలో 5.9 శాతం, మూడో త్రైమాసికంలో 5.3 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.8 శాతంగా ఉండనుందని తెలిపారు. 2022-23 తొలి త్రైమాసికంలో 5.1 శాతంగా ఉండనున్నట్లు అంచనా వేసినట్లు వివరించారు.