Mirabai Chanu: తనకు సాయపడిన ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లకు చిరు కానుక ఇచ్చిన ఒలింపిక్ రజత పతక విజేత
- టోక్యో ఒలిపింక్స్ లో రజతం గెల్చిన చాను
- ఇంఫాల్ లో నిత్యం ప్రాక్టీసు
- స్వగ్రామం నుంచి రోజూ రాజధానికి ప్రయాణం
- డబ్బుల్లేక లారీల్లో ప్రయాణం
- లారీల సిబ్బందికి విందు ఏర్పాటు చేసిన చాను
టోక్యో ఒలింపిక్స్ రెండో రోజునే భారత్ కు రజత పతకం అందించి యావత్ దేశాన్ని సంతోషంలో ముంచెత్తిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ప్రస్తుతం స్వగ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తాజాగా, 150 మంది ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లకు ఆమె చిరు కానుక అందించింది.
మీరాబాయి చాను స్వగ్రామం నాంగ్పోక్ కాక్చింగ్. మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే, చాను ప్రతిరోజూ ప్రాక్టీసు కోసం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పోర్ట్స్ అకాడెమీకి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో ఆమె డబ్బులు లేక తమ గ్రామం నుంచి నగరానికి వెళ్లే ఇసుక లారీలను ఆశ్రయించేది. ఆ లారీలు, ట్రక్కుల డ్రైవర్లు, క్లీనర్లు ఎంతో ఉదారంగా చానును ఉచితంగా ఎక్కించుకుని ఇంఫాల్ వరకు తీసుకువెళ్లేవాళ్లు. టోక్యో ఒలింపిక్స్ ముందు వరకు చాను ప్రాక్టీసు ఆ విధంగానే సాగింది.
దాంతో, తాను రజతం గెలవడం వెనుక ఈ ట్రక్ సిబ్బంది సాయం కూడా ఉందని భావించిన చాను వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి విందు ఏర్పాటు చేసింది. అంతేకాదు, ప్రతి ఒక్కరికీ ఒక షర్టు, మణిపురి స్కార్ఫ్ ను కానుకగా ఇచ్చి వారి పట్ల తన కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించింది .