Larry Page: సరిహద్దులు మూసి ఉన్నా న్యూజిలాండ్‌లో ప్రవేశించిన లారీ పేజ్.. ఎలా వచ్చారో చెప్పిన ఆ దేశ మంత్రి!
- కుమారుడి చికిత్స కోసం న్యూజిలాండ్‌లో నివాసహక్కును సొంతం చేసుకున్న పేజ్
- రూ. 51 కోట్లు పెట్టుబడి పెడితే ఆటోమెటిక్‌గా వీసా
- కుమారుడి కోసం కివీస్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు
- మండిపడుతున్న ప్రతిపక్షాలు
గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీపేజ్ కరోనా కరోనా సమయంలో న్యూజిలాండ్‌లో ప్రవేశించడం అప్పట్లో పెను చర్చకు దారితీసింది. సరిహద్దులు మూసేసి, విదేశీయలను అడుగుపెట్టకుండా కాపుకాసిన న్యూజిలాండ్ లారీపేజ్‌కు మాత్రం ద్వారాలు తెరిచింది. నిజానికి న్యూజిలాండ్ పౌరులకు మాత్రమే ఆ అవకాశం ఉంది. మరి లారీపేజ్ దేశంలోకి ఎలా రాగలిగారన్న దానిపై ఆ దేశ మంత్రి ఆండ్రూ లిటిల్ పార్లమెంటుకు తెలిపారు.
జనవరికి కొన్ని నెలల ముందు లారీ పేజ్ కుటుంబం ఫిజీలో నివసించింది. ఆ సమయంలో పేజ్ కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అత్యవసర చికిత్స నిమిత్తం అతడిని న్యూజిలాండ్ తరలించాలని పేజ్ భావించారు. అయితే, న్యూజిలాండ్‌లోకి విదేశీయులకు ప్రవేశం లేదు. దీంతో ఏం చేయాలా? అని ఆలోచించిన పేజ్.. ఆ దేశం అమలు చేస్తున్న ప్రత్యేక నిబంధన గురించి తెలిసి అప్పటికప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ఆ దేశంలోకి ప్రవేశించగలిగారు.
న్యూజిలాండ్‌లో కనీసం రూ. 51 కోట్లు పెట్టుబడి పెట్టేవారికి ప్రభుత్వం ప్రత్యేక వీసా మంజూరు చేస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న పేజ్ అప్పటికప్పుడు న్యూజిలాండ్‌లో నివాస హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ వెంటనే అధికారులు ఆమోదించడంతో పేజ్ తన కుమారుడిని న్యూజిలాండ్‌కు తరలించి చికిత్స చేయించగలిగారు. అయితే, సంపన్నులు ఇలా అప్పటికప్పుడు నివాస హక్కును సొంతం చేసుకోవడంపై ఆ దేశ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.