Sharmila: 'శభాష్ కేసీఆర్ గారు.. మీ పాలన మహా అద్భుతం' అంటూ షర్మిల చురకలు
- ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ వాసులను అరెస్టు చేశారు
- మొన్న దళిత మహిళ లాక్ అప్ డెత్
- ఈ రోజు చంటిపిల్లలున్న గిరిజన మహిళా రైతులను జైల్లో పెట్టించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. అటవీ అధికారులపై దాడి చేసినట్లు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌కు చెందిన పోడు భూముల సాగుదారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వారిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపుతోందని ఓ దినపత్రికలో వచ్చిన వార్తలను షర్మిల పోస్ట్ చేశారు.
23 మందిపై కేసు నమోదయ్యాయని ఆ వార్తల్లో పేర్కొన్నారు. వారిలో 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో 18 మంది మహిళలే. వారిలో ముగ్గురు మహిళలకు ఏడాదిలోపు వయసున్న చంటిబిడ్డలు ఉన్నారు. ఈ ముగ్గురిని కూడా పోలీసులు నిన్న ఖమ్మం 3వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి కోర్టు ఆదేశంతో 14 రోజుల రిమాండ్‌కు తరలించడం గమనార్హం. నిందితురాలు ఆలకుంట రాణి ఏడాది వయసున్న తన కూతురితో జైలుకెళ్లింది. ఎత్తేరు కవిత అనే మరో మహిళ 8 నెలల పాపతో, ఆలకుంట మౌనిక మూడు నెలల పాపతో జైలుకెళ్లింది. పిల్లలు ఏడుస్తుండడంతో వారిని తీసుకుని వెళ్లడానికి అనుమతించారు. ఈ విషయాన్ని షర్మిల ప్రస్తావించారు.
'శభాష్ కేసీఆర్ గారు.. మొన్న దళిత మహిళ లాకప్ డెత్.. ఈ రోజు గిరిజన చంటిపిల్లలున్న మహిళా రైతులను జైల్లో పెట్టించారు.. మీ పాలన మహా అద్భుతం. పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి .. ఈ రోజు పోడు చేసుకొంటున్న మహిళా రైతులను జైల్లో పెట్టించారు కేసీఆర్ సారు' అని షర్మిల విమర్శించారు.
'గిరిజనులు లేకపోతే అడవి లేదు.. వాళ్లు లేకపోతే పర్యావరణం లేదు .. అయినా అడవిని నాశనం చేస్తున్నారంటూ.. భూ అక్రమణదారులని.. గిరిజనులపై ఆక్రమణ కేసులు పెడుతూనే ఉంది కేసీఆర్ ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారుల భుజాల మీద తుపాకులను పెట్టి వారిని.. అడవినుంచి ఖాళీ చేయించాలని చూస్తున్నారు కేసీఆర్ దొర' అని షర్మిల విమర్శించారు.