Sajjala Ramakrishna Reddy: 'నేతన్న నేస్తం' పథకంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయి: సజ్జల
- నేడు జాతీయ చేనేత దినోత్సవం
- విజయవాడ ఆప్కో భవన్ లో వేడుకలు
- హాజరైన సజ్జల
- అభివృద్ధికి నిర్వచనం చెప్పిన వైనం
ఇవాళ జాతీయ చేనేత దినోతవ్సం సందర్భంగా విజయవాడ ఆప్కో భవన్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో తీసుకువచ్చిన 'నేతన్న నేస్తం' చేనేత కార్మికులకు ఎంతో అండగా ఉందని తెలిపారు. 'నేతన్న నేస్తం' వచ్చాక చేనేత కార్మికుల ఆత్మహత్యలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. భారీ భవనాలు నిర్మిస్తే అది అభివృద్ధి అనిపించుకోదని, గ్రామీణ స్థాయిలోనూ సకల సదుపాయాలు కల్పించడమే అభివృద్ధి అని సీఎం జగన్ విశ్వసిస్తారని సజ్జల వివరించారు.
రాష్ట్రంలో ఖాదీ, చేనేత, పొందూరు వస్త్ర పరిశ్రమల ద్వారా తయారైన వస్త్రాలను ఇప్పటి తరానికి చేరువ చేస్తామని... అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ పోర్టళ్లలోనూ ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తామని వెల్లడించారు. గ్రామీణ స్థాయిలో అభివృద్ధిని చేసి చూపుతామని, గ్రామ స్వరాజ్యం సాకారం చేస్తామని పేర్కొన్నారు.