Neeraj Chopra: స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు చంద్రబాబు, చిరంజీవి, మహేశ్ బాబు అభినందనలు!
- టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రాకు స్వర్ణం
- చరిత్ర సృష్టించాడన్న చంద్రబాబు
- దేశం పులకిస్తోందన్న లోకేశ్
- ఇవి కదా మధుర క్షణాలు అంటూ చిరు ట్వీట్
- భళా అంటూ మహేశ్ బాబు అభినందన
టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. నీరజ్ చోప్రాను చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడని, ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో తొలి బంగారు పతకం అందించాడని అభినందించారు. కఠోర శ్రమ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన చోప్రా... తర్వాతి తరం అథ్లెట్లు కంచుకోటలు బద్దలు కొట్టేలా స్ఫూర్తినందిస్తాడని పేర్కొన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ, ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఈవెంట్లలో భారత్ కు నీరజ్ చోప్రా తొలి స్వర్ణం అందించడం ద్వారా యావత్ దేశం పులకిస్తోందని తెలిపారు. చారిత్రక విజయం సాధించిన చోప్రాకు వేనవేల అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. భారతీయులందరూ ఇది గర్వపడే రోజు అని పేర్కొన్నారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం నీరజ్ చోప్రా మహోన్నోత ప్రదర్శన పట్ల ముగ్ధులయ్యారు.
భారత్ కు ఇది నిజంగా ఘనమైన తరుణం అని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. అథ్లెటిక్స్ లో భారత్ కు ఒలింపిక్ స్వర్ణం... ఈ క్షణం కోసం 101 ఏళ్లు పట్టాయని వివరించారు. "నీరజ్ చోప్రా... నీకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. నువ్వు చరిత్ర సృష్టించడమే కాదు, చరిత్ర గతినే మార్చేశావు" అంటూ కితాబునిచ్చారు.
సూపర్ స్టార్ మహేశ్ ట్వీట్ చేస్తూ, నీరజ్ చోప్రా పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. భళా అంటూ అభినందించారు. భారత్ కు ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఈవెంట్లలో లభించిన తొలి స్వర్ణం ఇదని కొనియాడారు. సంతోషంగా ఉప్పొంగిపోవడమే కాదు, గర్విస్తున్నామని తెలిపారు.