Neeraj Chopra: ఇది భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు: ఏపీ సీఎం జగన్
- టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం
- ఎక్కడ చూసినా చోప్రా పేరే!
- తలెత్తుకునేలా చేశాడన్న ఏపీ గవర్నర్
- మరిన్ని పతకాలు గెలవాలని సీఎం ఆకాంక్ష
నీరజ్ చోప్రా.... నీరజ్ చోప్రా... నీరజ్ చోప్రా.... ఇప్పుడెక్కడ చూసినా ఈ నామస్మరణే. టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ స్వర్ణం గెలిచి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన ఘనత ఈ పానిపట్ యోధుడికే దక్కింది. హర్యానాలోని పానిపట్ నుంచి వచ్చిన నీరజ్ చోప్రా... ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో ఒలింపిక్స్ బరిలో దిగి ప్రాథమిక రౌండ్ల నుంచే సంచలనాల మోత మోగించాడు. ఇవాళ్టి ఆఖరి అంకంలోనూ అసమాన ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు.
దీనిపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్పందించారు. "నీరజ్ చోప్రాకు అభినందనలు. క్రీడాప్రపంచంలో భారతీయులు తలెత్తుకునేలా చేశాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి" అని పిలుపునిచ్చారు.
ఏపీ సీఎం జగన్ స్పందిస్తూ... ఇది భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని అభివర్ణించారు. "టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రాకు అభినందనలు. నీరజ్ చోప్రా ప్రతిభ చూసి దేశమంతా గర్విస్తోంది. 2024 పారిస్ ఒలింపిక్స్ లో భారత పతకాల సంఖ్య మరింత పెరగాలి" అని ఆకాంక్ష వ్యక్తం చేశారు.