Neeraj Chopra: గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు హర్యానా సర్కారు రూ.6 కోట్ల నజరానా
- టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రాకు స్వర్ణం
- దేశవ్యాప్తంగా సందడి వాతావరణం
- మిఠాయిలు పంచుకున్న చోప్రా కుటుంబం
- గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించనున్న హర్యానా సర్కారు
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించడమే కాకుండా, శతాధిక వసంతాల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు ఇప్పటివరకు అథ్లెటిక్స్ లో స్వర్ణం లేదన్న కొరత తీర్చిన యువ అథ్లెట్ నీరజ్ చోప్రా ఇప్పుడు జాతీయ హీరో అయ్యాడు. ఈ క్రమంలో నీరజ్ చోప్రాపై హర్యానా సర్కారు నజరానాల వర్షం కురిపించింది. టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం చేజిక్కించుకున్నందుకు రూ.6 కోట్ల నగదు పురస్కారం అందించనుంది. దాంతోపాటే గ్రూప్-1 ఉద్యోగం, 50 శాతం రాయితీతో ఇంటి స్థలం కేటాయించనున్నారు.
కాగా, తాజా ఘనత అనంతరం అతడి స్వరాష్ట్రం హర్యానాలో సంబరాలు మిన్నంటుతున్నాయి. పానిపట్ లో చోప్రా కుటుంబ సభ్యులు మిఠాయిలు పంచుకున్నారు.
23 ఏళ్ల నీరజ్ చోప్రా జూనియర్ స్థాయి నుంచే ప్రతిభను ప్రదర్శిస్తూ ఒలింపిక్స్ స్థాయికి ఎదిగాడు. గతంలోనూ ఈ జావెలిన్ త్రోయర్ పతకాల పంట పండించాడు. 2016లో వరల్డ్ అండర్-20 చాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రా స్వర్ణం నెగ్గి సంచలనం నమోదు చేశాడు. ఆ ఏడాది జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్ షిప్ లో రజతం, ఆ తర్వాత 2017 ఆసియా చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ చేజిక్కించుకున్నాడు. 2018 ఆసియా క్రీడల్లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి వరించింది.